ఆందరికీ స్వాగతం

please leave your suggestions and opinions.

Monday, July 19, 2010

బాబు - బాబ్లి

గత వారం రోజులుగా న్యూస్ ఫాలో అవుతున్న అందరి మదిలో మెదిలే, కొందరి మదిలో మెరిసే ఆలోచన ఏమిటంటే 'ఇంత హఠాత్తుగా చంద్రబాబు కి బాబ్లి ఎందుకు గుర్తుకు వచ్చింది ' అని.ఈ వ్యవహారంలో నాకు అనిపించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని అనిపించి ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.
తెలంగాణా విషయంలో చంద్రబాబు ని ఇరకాటం లో పెట్టి టి.డి.పి. ని ఏ.పి. లో నామరూపాలు లేకుండా చేయాలని 'అమ్మ ' పన్నిన కుట్రలో, చంద్రబాబు ఎంతో తెలివిగా అంతకంటే ఎక్కువ ఓపికతో (దాదాపు నెలరోజులపాటు మీడియా కంటికి కనపడకుండా) తప్పించుకున్నారు. ఐతే ఆ దెబ్బ లో నష్టపోయింది (ఎంతో ఇంకా పూర్తిగా తేలలేదు) ఎవరయ్యా అంటే మన 'మెగా ' చిరు. అమ్మ తెలిసో తెలియకో ఒకరకంగా చంద్రబాబు కి మేలు చేసిందనే చెప్పాలి. ఎలాగంటే తెలంగాణా ఉప ఎన్నికలలో పోటీ నుంచి పి.ఆర్.పి. ని తప్పించడమే. ఎందుకంటే గత ఎన్నికలలో పి.ఆర్.పి. చాలా చోట్ల టి.డి.పి.ఓట్లను చీల్చింది. ఐతే తెలంగాణా ఉప ఎన్నికలలో కొన్ని సీట్లు గెలవాలన్నా ముందు ప్రచారం చెయ్యాలి కదా!. టి.ఆర్.ఎస్. వాళ్ళేమో ఆంధ్రా వాళ్ళని ప్రచారానికి కూడా రానివ్వ మంటున్నారాయే. సందట్లో సడేమియా లాగా ఇప్పుడే జగన్ ఓదార్చుతానంటుంటే అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమి చెయ్యాలో పాలుపోని స్థితి లో వున్నారు. మరో వైపు డి.ఎస్ ఏమో తను గెలిస్తే సి.ఎం. అవుతానని ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు మధ్యంతర బాకా ఊదా వచ్చంటూ కధనాలు గుప్పిస్తున్నారు. అన్నింటికీ మించి తాము గెలిస్తే తెలంగాణా ఎలా తెస్తామో ఏ ఒక్క పార్టీ కూడా చెప్పకుండా ప్రజలను మరో సారి ఫూల్స్ ని చేయాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బాబ్లీ అంశం తెరమీదకి వచ్చింది. ఇందులో మనం చంద్రబాబు యొక్క రాజకీయ చాణక్య నీతి గమనించవచ్చు. ఇది తెలంగాణాలో తిరుగుతూ చేస్తున్న ప్రచారం కాదు, తను బయటే ఉంటూ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలాగూ రాష్ట్రాల వ్యవహారంలో ఆ రాష్ట్రం లోని అన్ని రాజకీయ పక్షాలు ఏకమవుతాయని (మన వాళ్ళు తప్ప) తెలుసు కనుకనే ఈ వ్యూహం పన్నారు. ఎలాగైనా ఉప ఎన్నికల వరకూ జైల్ లోనే ఉంటే దాని ప్రభావం ఎంతో కొంత ఎన్నికలలో ఉంటుందని భావిస్తున్నాను. ఐతే ఇన్నాళ్ళూ గుర్తుకు రానిది ఇప్పుడు గుర్తుకు వచ్చినంత మాత్రాన భుజాలకెత్తుకోవటానికి ప్రజలేమి వెర్రివాళ్ళు కాదని కొందరి అభిప్రాయం. ఐతే నా ఊహ ఎమిటంటే ఈ విషయం ఎన్నికలలో లాభం కలిగించినా కలిగించక పోయినా, నష్టం మాత్రం కలిగించదు అని. ఒకరకంగా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది పెద్దవాళ్ళు చెప్పినట్లు 'పోతే వెంట్రుక వస్తే కొండ '. అన్నింటికీ మించి ఈ విషయం లో కనుక చంద్రబాబు నిజంగా సక్సెస్ ఐతే, ఈ పరిణామాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో మరో అధ్యాయానికి నాంది కావచ్చు. దేనికైనా మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Thursday, July 8, 2010

ఎవరికోసమీ ఓదార్పు?

ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఫాలో అవుతున్న ప్రజలందరి మదిలో ఇప్పుడు మెదిలే ప్రశ్న ఏమిటంటే 'జగన్ యాత్రను అధిష్టానం ఎందుకు ఆపుతుంది?'. నా అంచనా ప్రకారం గాంధీ కుటుంబ వారసులను తప్పించి మరో కుటుంబాన్ని పైకి రానిచ్చిన ఆనవాయితీ ఈ కాంగ్రెస్ లో లేదు. దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. మన రాష్ట్రం లోనే మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, జలగం వెంగళరావు, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, పి. వి. నరసింహారావు లాంటి వాళ్ళ వారసులకి జరిగిన (అ)న్యాయం అందరికీ తెలిసిందే. ఐతే వారి వారసులకి మన రాజా గారి కుమారుడికి ఉన్న తేడా ఏమిటంటే, అంగ బలం మరియు అర్ధబలం. పాత ముఖ్యమంత్రులలో ఎవరూ ఆకస్మికంగా మరణించలేదు. ఆ విషయంలో జగన్ పట్ల కొంత మేర సానుభూతి వచ్చిన మాట వాస్తవం. పాత ముఖ్యమంత్రుల వారసుల విషయం లో జరిగిన అన్యాయం ఐతేనేమి న్యాయం ఐతేనేమి, తెలుసుకున్నారు కనుకనే, రాజా గారు మరణించిన కొన్ని గంటల లోపే వారి అనుచరగణం రంగంలోకి దిగారు, యువరాజా వారిని సి.ఎం. చేయమని సంతకాల సేకరణ జరిపారు. ఐతే ఆచారం ప్రకారం మరణించిన మనిషితో పాటే వాళ్ళ వారసులని మర్చిపోయే అధిష్టానం, జగన్ ని కూడా ఆటలో అరటిపండులాగా తీసేయాలని ప్రయత్నించింది. కానీ అక్కడే జగన్ 'అమ్మ ' కు పక్కలో బల్లెం లాగా మారాడు. ఈ అవకాశం వదులుకొంటే కమ్యూనిస్టులు 'చరిత్రాత్మక తప్పిదం' చేసినట్లుగా తరువాత బాధపడ్డా ఉపయోగం వుండదు అని, రోశయ్య సి.ఎం. ఐన దగ్గరి నుంచి ఎన్నో విఘ్నాలు కల్పించారు. రాజా వారి హయాం లో అవకాశం దొరకని వారందరూ ఇదే అదనుగా భావించి , జగన్ ను ఎలాగైనా సి.ఎం. కాకుండా అడ్డుపడ్డారు. ఇక ఇవేవీ కుదరవని తెలుసుకొని, జగన్ అధిష్టానాన్ని బె(ఎ)దిరించి ఐనా తన పట్టు నిలుపుకోవాలని చేస్తున్న ప్రయత్నం గానే ఈ ఓదార్పు యాత్రను చూడవచ్చు. ఒకవేళ ఇప్పుడు కొంచెం మెత్తపడ్డట్లు కనిపించినా అవకాశం దొరికినప్పుడు తప్పనిసరిగా ఇంతకింత ప్రతీకారం తీర్చుకొంటుంది అధిష్టానం. ఒకరకంగా చెప్పాలంటే ఇది జగన్ కు పరీక్షా సమయం. మొండిగా ప్రవర్తించి ఆస్తులు పోగొట్టుకొంటాడో, తెలివిగా ప్రవర్తించి అవకాశం కోసం ఎదురు చూస్తాడో కాలమే సమాధానం చెప్పాలి.

Friday, July 2, 2010

కాలేజ్ డేస్ - 2

ఆ తరువాత అడ్మినిస్ట్రేటివ్ భవనం లోకి వెళ్ళాక, అడ్మిషన్స్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకొనేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. అప్పట్లో ప్రతి విద్యార్ధికి ఒక సలహాదారు గా ఎవరో ఒకరిని నియమించేవారు. మరి అదే ఆచారం ఇప్పుడు వుందో లేదో తెలియదు. అలా నాకు మొదట్లో విజయ్ కుమార్ రెడ్డి అనే జన్యు శాస్త్ర ప్రొఫెసర్ ని నియమించారు. ఈ సలహాదారుల ముఖ్యమైన విధులు ఎమంటే, తమకు కేటాయించిన విద్యార్ధుల బాగోగులు, విద్యా సంబంధమైన విషయాలను చూసుకోవటం, ఇంకా అవసరమనిపిస్తే సలహలివ్వటం, ఒక్కోసారి విద్యార్ధి తల్లిదండ్రులని పిలిపించి విద్యార్ధి యొక్క పురోగతిని గూర్చి చర్చించటం. నాలుగు సంవత్సరాలపాటు ఉంటారనుకున్న మా అడ్వైజర్, కొన్ని నెలల తరువాత వేరే ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోవటంతో, ఆయనకి కేటాయించిన విద్యార్ధులందరికీ కలిపి 'రజియా సుల్తానా' అనే మరో జన్యు శాస్త్ర సహ ప్రొఫెసర్ ని తరువాతి కాలంలో నియమించటం జరిగింది. నిజానికి ఏరోజు కూడా మా సలహాదారు విద్యార్ధుల పురోగతిని సమీక్షించినట్లు గానీ, సలహాలు అందించినట్లు గానీ నాకు తెలియదు. ప్రతిసారీ సెమిష్టర్ రిజిస్ట్రేషన్ సందర్భంలో సలహాదారు సంతకం తీసుకోవటం మినహా ఆవిడతో మాకు పని పడేది కాదు. సరే, అలా ఆరోజు నాతో పాటు, వెంకటసుబ్బయ్య, యర్ని కాంతమ్మ, యమున అనే వాళ్ళం ఒకేసారి మొదటిసారిగా సలహాదారు వద్దకు వెళ్ళటం జరిగింది. ఆ రోజు నా చూపు ఎలాగుందో తెలియదు కానీ, ఆ చూపులు మరికొన్ని సంవత్సరాలపాటు, నన్ను నాలో లేకుండా చేసింది. నా జీవితాన్ని, జీవన గమనాన్ని, ఆశల్ని, ఆశయాల్ని మార్చి వేసిన రోజు అది. ఆ రోజు, ఆ క్షణం, నా జీవితంలో పెను తుఫాన్ నే రేపుతుందని నేనూహించలేదు. ఇది చదువుతున్నవారందరూ ఊహించినట్లుగానే, నేను ప్రేమలో పడ్డాను. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాను, అదీ కాలేజ్ లో చేరిన మొదటి రోజునే. ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ నిజం! నా జీవితంలో 11 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు నన్ను ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మర్చిపోలేనంతగా ప్రభావితం చేశాయి. మరిన్ని విశేషాలు వచ్చే పోస్ట్ లో వ్రాస్తాను. సెలవు........

Tuesday, June 22, 2010

కాలేజ్ డేస్ -1

ఆది జనవరి 8, 1999. నా కాలేజ్ ఓపెన్ చేసే రొజు కూడా అదే. అంతకు మునుపెన్నడూ మా జిల్లా ముఖ్య కేంద్రం ఐన ఒంగోల్ ను దాటి వేరే ప్రదేశానికి వెళ్లక పొవడం తో ఎంతో ఉత్సాహాం గానూ, ఉద్వేగం గానూ వుంది. ఎంసెట్ లో 2711 ర్యాంక్ రావటం తో అగ్రికల్చర్ సైన్సెస్ లొ అడ్మిషన్ వచ్చింది. మెడిసిన్ కోసం రెండు సార్లు ప్రయత్నించిన నాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఏది ఎమైనా వచ్చిన అవకాశం వదులుకోవడం ఇష్టం లేక అగ్రికల్చర్ సైన్సెస్ లొ చేరటానికి నిశ్శ్చయించుకొన్నాను. అంతకు మునుపెన్నడూ ఒంటరిగా బయటికి వెళ్ళక పోవటంతోను మరియు ర్యాగింగ్ గురించిన భయాలతోను ఒక్కడినే వెళ్ళటానికి సాహసించలేకపొయాను. ఉదయాన్నే బయలుదేరిన మేము (నేను, నాన్నగారు) మధ్యలో ట్రాఫిక్ జాం అవటం వల్ల బాపట్ల చేరేసరికి దాదాపు 11 గంటలు అయింది. కాలేజ్ కి వెళ్ళే సరికే కొంతమంది కొత్త విధ్యార్ధులను క్యాంపస్ బయటే ర్యాగింగ్ చేయటం చూసి కాళ్ళలో వణుకు ప్రారంభమైంది.నా ప్రక్కనే మా నాన్నగారు ఉన్నారని కూడా భయం లేకుందా, నన్ను బెల్ట్ తీయించి, చెప్పులని మార్చి తొడుక్కొమ్మన్నారు. మా నాన్నగారు కూడా ఏమీ మాట్లాడక ఫోవటంతొ, వాళ్ళు చెప్పినట్లు చేయవలసి వచ్చింది.